s

https://www.youtube.com/feeds/videos.xml?channel_id=UCSMunv3hLjY1Td8xJXNTEGA

Sunday, 22 January 2017

వేదాలను వ్యతిరేకించే ఇన్ని వర్గాలు ఎందుకు ఏర్పడ్డాయి? vedas birth

వైష్ణవులు, గణాపత్యులు, కాపాలికులు, చీనమార్గరతులు, వల్కలదారులు, దిగంబరులు, బౌద్ధులు, చార్వాకులు, పాషండులు ఇలా ఎన్నో తెగలవారు వేదములందు శ్రద్ధలేని వారై ప్రవర్తిస్తూ ఉంటారు కదా! ఇందరు ఇంతమంది దేవతలను కొలుచుటకు కారణం ఏమిటి? మతిమంతులు, పండితులు, నానాతర్కములందు నేర్పరులు, వేదములందు శ్రద్ధ మాని ప్రవర్తిస్తూ ఉంటారు. ఎవడైనా తన బుద్ధితో తన చెడ్డ కోరుకోరు కదా! ఈ భిన్నత్వమునకు కారణమేమి? అని వ్యాసుడిని జనమేజయుడు అడిగాడు.



వ్యాసుడు ఇలా చెప్పాడు.. జనమేజయా! పూర్వం ప్రాణుల కర్మవశమున పదిహేను సంవత్సరాలపాటు వానలు లేవు. ఆ అనావృష్ఠి వలన సర్వనాశనం జరిగింది. కరువులు ఎక్కువై ఇంటింటా జనులు మృతి చెందుతూ ఉన్నారు. కొందఱు ఆకలి బాధ తట్టుకోలేక గుఱ్ఱములను, ఏనుగులను, పందులను తినగా మఱికొందరు పీనుగులను పీక్కుతినేను, మఱికొందరు తల్లి బిడ్డను, భర్త భార్యను, భార్య భర్తను పీక్కుతినేను.




అప్పుడు బ్రాహ్మణులందరు బాగా అలోచించి ఈ సమయములో మహాతపస్వి యైన గౌతముడు ఒక్కడే ఈ బాధలను మాన్పగలిగినవాడు. కనుక మనమందరూ కలిసి గౌతముని ఆశ్రమము వద్దకు వెళదాం. అయన గాయత్రీ ఉపాసనాపరుడు కావడం చేత అక్కడ సుభిక్షంగా ఉన్నది. ఆచోట అనేకమంది సుఖంగా బ్రతుకుతున్నారు. అని తలచి సాగ్ని హోత్రులు గృహస్థులు అయిన విప్రులు తమతమ ఆలమందలతో దాసదాసీ జనంతో నలుదిక్కుల నుండి గౌతముని ఆశ్రమం చేరారు. గౌతముడు వారి రాకను గమనించి వారికి నమస్కరించి వచ్చినవారికి తగిన ఆసనములు ఇచ్చి గౌరవించి కుశలప్రశ్నలు అడిగి వారి రాకకు కారణం అడిగెను




. వారందఱూ తమతమ కష్టములు చెప్పుకొనగా వారందరికీ అభయమిచ్చి "ఇది మీ ఇల్లు, నేను మీదాసుడను. మీదాసుడైన నేనుండగా మీకీ విచారం ఎందుకు? తపోధనులైన మీరాక వలన చెడు సైతం మంచిగా మారగలదు. మీ అందరి పాదధూళి చేత నా గృహం పావనమైనది. మీరందఱూ సంధ్యాజప పరాయణులై ఇక్కడే సుఖంగా ఉండండి. అని వారందరినీ ఊరడించాడు.
అనంతరం గాయత్రీ దేవి భక్తి పరాయణుడై గాయత్రిని ప్రార్ధించాడు.




 వేదమాత! పరాత్పరా! మహా విద్యా!. ప్రణవ స్వరూపిణి! సకలార్ధ ప్రదాయిని! విశ్వరూపిణి! సచ్చిదానంద స్వరూపిణి! సర్వవేదాంత వేద్య, సూర్యమండలం నివాసిని!ఉదయమున రక్తవర్ణవు, బాలవు, మధ్యాహ్నమున నవయువతివి! సాయంకాలమున కృష్ణ వర్ణవు-వృద్ధవు! నిత్యమూ నీకు శతకోటి నమస్సులు! సకల ప్రాణులను తరింపజేయు పరమేశ్వరీ నా అపరాధములు క్షమింపుము. అని స్తుతించగా విని గాయత్రీదేవి ప్రత్యక్షమై ఒక అక్షయ పాత్ర ఇచ్చి "ఈపాత్ర ఎందరినైనా పోషించగలదు. గౌతమా!నీవు కోరినదెల్లా ఈపాత్ర నీకు ఈయగలదు. అటువంటి పాత్రను నీకు ఒసంగితిని" అని చెప్పి పరమ కళ యగు గాయత్రీదేవి అదృశ్యమయ్యెను.





అప్పుడు ఆపాత్ర నుండి అన్నము, షడ్రసములైన పదార్ధములు, పలురకములైన పాత్రలు, వస్త్రములు, ఆభరణములు రాసులు రాసులుగా వెలువడ్డాయి. గౌతముడు ఏది అడిగినా అడిగిన ప్రతి వస్తువు ఆపాత్ర నుండి ప్రత్యక్షమైంది. అంతట గౌతమ మహర్షి అందరిని పిలిచి ధనకనక వస్తు వాహనములు, వస్త్రములు, ఆభరణములు, సొమ్ములు ప్రదానము చేసాడు.



ఇంతెందుకు! గొఱ్ఱెలు, బఱ్ఱెలు, గోవులు పశువులు, యజ్ఞ పరికరములైన స్రుక్కు స్రువములు కూడా వచ్చాయి. ముల్లోకములందు ఏయే వస్తువులు గలవో అన్ని ఆ పాత్ర నుండి వచ్చాయి. దీంతో గౌతముడు యజ్ఞం చేయతలచి అందరిని ఆహ్వానించి యజ్ఞ విషయం చెప్పగా అందరూ కలిసి యజ్ఞం ఆరంభించారు. స్త్రీలు దివ్యాభరణములు ధరించి దేవతాస్త్రీల వలె అలరారారు. పురుషులు వస్త్రములు ఆభరణములు దాల్చి దేవతల వలె వెలుగొందారు. ఈవిధంగా గౌతమయుని ఆశ్రమం నందు నిత్యోత్సవములు జరుగుతూ ఉన్నాయి.




అక్కడ రోగభయము కాని మృత్యు భయము గాని దైత్య భయము కానీ మచ్చుకకైనా లేదు. ఈవిధంగా ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చేవారితో గౌతమముని ఆశ్రమం నూరు ఆమడల దూరం వరకు వ్యాపించింది. గౌతముడు వచ్చినవారందరికీ అభయమిచ్చి పోషిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఎన్నో విధములైన మహాయజ్ఞాలు చేశాడు. అందఱు గౌతముడిని వేయినోళ్ల పొగిడారు. ఇంద్రుడు సైతం ఇంద్రసభలో గౌతముడ్ని ప్రశంసించాడు.
ఆహా! గౌతముడు ఇప్పుడు మాకు మహాకల్ప వృక్షం వంటివాడు అయ్యాడు.





అతడు కీర్తిమంతుడై మా కోరికలు తీర్చుతున్నాడు. గౌతముడే లేనిచో మాకీ యజ్ఞముల యందు హవిర్భాగములు ఎక్కడివి? గౌతముడు ఎల్లవారిని కన్నబిడ్డల వలె పోషిస్తున్నాడు అంటూ కీర్తించాడు. గౌతముడు తన ఆశ్రమమును గాయత్రీ పీఠముగా మార్చాడు. ఆనాటి నుండి మునులందరూ గాయత్రీదేవిని పూజిస్తూ ఉన్నారు. అచ్చట నేటికీ గాయత్రీ ఉదయం బాలగా, మధ్యాహ్నం యవ్వనవతిగా, సాయంకాలం వృద్ధగా దర్శనం ఇస్తుంది.




ఒకనాడు నారదుడు వీణను మీటుకుంటూ గాయత్రీ జపం చేసుకుంటూ గౌతముని ఆశ్రమం వద్దకు రాగా గౌతముడు నారద మహర్షిని ఆహ్వానించి తగిన రీతిలో గౌరవించి ఆసనమివ్వగా నారదుడు సంతోషించి గౌతమ మహర్షిని కొనియాడి "మహర్షి! నీకీర్తి దిగంతాలవరకు వ్యాపించింది. దేవేంద్రుడు సైతం నిన్ను కీర్తించగా చూడవలెననే వేడుకతో ఇచ్చటికి వచ్చాను. గాయత్రీ వరప్రసాదమున నీవు ధన్యుడవైతివి. అని నారదుడు గౌతముడిని పొగిడి గాయత్రీ ఉన్నచోటికి వెళ్లి ప్రణమిల్లి ప్రేమభక్తితో పెల్లుబికిన హృదయంతో దేవిని సందర్శించాడు.





 పలురీతిగా స్తుతించి స్వర్గానికి వెళ్ళాడు. ఈవిధముగా గాయత్రీ దయవలన గౌతముడు మునులందరినీ పోషించగా గౌతముని కీర్తి ప్రతిష్ఠలు వినివిని మునులందరూ అసూయ చెందారు. కీర్తిని వమ్ముచేయాలని తలచారు. సమయం వచ్చినపుడు చూసుకుందామని వేచి ఉండగా కొంతకాలానికి వర్షాలు పడ్డాయి.అడవులు దేశములు పాడిపంటలతో పచ్చని పైరుతో కళకళలాడాయి. అదివిని బ్రాహ్మణులందరు ఒకచోట గుమిగూడారు.





వారందఱు అన్నం పెట్టిన గౌతమ మహర్షికి చెడు చేయడానికి పూనుకొన్నారు. ఇలాంటి కొడుకులని కన్న తల్లిదండ్రులని ఏమనాలి? కాలం ఇలాంటిది అని తెలుపడం ఎవరికీ సఖ్యం వ`అవుతుంది? వారందరూ చావడానికి సిద్ధంగా ఉన్న ఒక ముసలి ఎద్దుని సృష్టించి గౌతముడు యజ్ఞం చేసే సమయానికి అది యాగశాలలోకి వచ్చేలా చేసారు. అప్పుడు గౌతముడు గోవు రావడం చూసి హుంకారం చేసాడు. ఆ హుంకార శబ్దానికి గోవు మరణించింది.
అయ్యో! దుష్ఠుడు గోవుని చంపేనే! అని వారందఱు గౌతముడిని నిందిస్తూ ఉండగా గౌతముడు యజ్ఞమును ఆపివేసి దీనంతటికి కారణం ఏమై ఉంటుందో తెలుసుకోవడానికి సమాధి స్థితిలోకి వెళ్ళాడు. జరిగిన విషయం గ్రహించి దీనంతటికీ కారణం బ్రాహ్మణులు పన్నిన పన్నాగమే అని యెరిగి ప్రళయకాల రుద్రుల వలె కన్నులు ఎఱ్ఱజేసి ఈవిధంగా శపించాడు.






బ్రాహ్మణాధములారా! మీరు వేదమాత అగు గాయత్రీ ధ్యానం మానివేతురు గాక! గాయత్రీ మాతను వదలడం వలన మీరు బ్రాహ్మణాధములు అగుదురు గాక! వేదముల యందును, యజ్ఞముల యందును, వేద వార్తల యందును విముఖులగుదురు గాక! శివుని యందు, శివ మంత్రము నందు, శివశాస్త్రముల యందు విముఖులు అగుదురు గాక! మీరు మూల ప్రకృతి యైన శ్రీదేవి ధ్యానమునందు - కథల యందు విముఖులై యుందురు గాక! శ్రీదేవి మంత్రము అనుష్ఠానము నందు విముఖులై బ్రాహ్మణాధములు అగుదురుగాక!





శ్రీదేవి మహోత్సవములు, శ్రీదేవీ దివ్యనామములు కీర్తించుటకు మీరు నోచకుందురు గాక! శ్రీదేవి భక్తిని, దేవీపూజలను నిందించువారు అగుదురు గాక! శివమహోత్సవములు దర్శించు వేడుకను, శివ భక్తులను సత్కరించు కోరికయును మీకు కలగకుండు గాక! రుద్రాక్షలు, మారేడు, భస్మము నందు మీకు ప్రీతి కలుగకుండు గాక! అద్వైత మార్గమునందు, జ్ఞానమందు శాంతి దాంతుల యందు నిష్ఠలేని నికృష్ఠ జీవులగు బ్రాహ్మణ భ్రష్ఠులై తిరుగుదురు గాక!






వేద పఠనము - స్వాధ్యాయము - నిత్యకర్మానుష్టానము - అగ్నికార్యము - ప్రవచనము నందు విముఖులై కర్మ భ్రష్ఠులు అగుదురు గాక! గోదానము - పితృ శ్రర్ధ కర్మలు - చేయుటకు ఇష్టపడని నికృష్ట జీవులగుదురు గాక! కృచ్ఛము - చంద్రాయణము - ప్రాయశ్చిత్తము చేయని దురాచారులై అధములై యుందురు గాక! గాయత్రీ మాతను వదిలిపెట్టి ఇతర దేవతలను కొలిచి శంఖ చక్రములు దాల్చు బ్రాహ్మణాధములై చెడుదురు గాక!





తల్లిదండ్రులను, కన్నబిడ్డలను, సోదరులను, భార్యను అమ్ముకొని బ్రతుకు బ్రాహ్మణాధములు అగుదురు గాక!వేదమును - తీర్థమును, ధర్మమును, నామ సంకీర్తనమును అమ్ముకొను బ్రాహ్మణాధములు అగుదురు గాక! పాంచరాత్రములు - కామశాస్త్రము - బౌద్దము - కాపాలికము - పాషండ మున్నగు మతము లందు ఆసక్తులై బ్రాహ్మణాధములు అగుదురు గాక!




తల్లి, కన్య - సోదరి మొదలగు వారితో వావివరసలు లేక కలయునట్టి నీచ్య బ్రాహ్మణాధములు అగుదురు గాక! మీరే కాక మీమీ వంశము నందలి స్త్రీ పురుషులు నా శాపాగ్నికి దగ్ధులగుదురు గాక! నేను ఇంతగా చెప్పనేల! ఆ మూల ప్రక్రుతి యైన గాయత్రీ మిమ్ములను కోపించి యుండును మీరు అంధకూపము మున్నగు నరకములందు పతితులు అగుదురు గాక! ఈ విధముగా గౌతముడు శాపమిచ్చి నీటిని తాకాడు. పిదప గౌతమును గాయత్రీ మాత దర్శనం కోసం  బయలుదేరి మహాదేవిని చేరి ప్రణమిల్లారు.





గాయత్రీదేవి బ్రాహ్మణులూ చేసిన దురాచారానికి విస్మయము చెందినది. (ఇప్పటివరకు కూడా గాయత్రీ ముఖము ఇలాగే ఉన్నది).. గాయత్రీదేవి చిరునవ్వులు చిందు ముఖకమలముతో గౌతమా! పాముకు పాలు పోసిన విషమగును. నీవు ఇప్పుడు శాంతించుము. కర్మగతి ఇటులనే ఉందును. దేవివాక్కులు విన్న గౌతముడు తన ఆశ్రమమునకు వెళ్ళాడు. పశ్చాత్తాప పడ్డారు. గౌతమ మహర్షికి సాష్టాంగపడి సిగ్గుతో దించినతల ఎత్తకుండా అలాగే ఉండిపోయారు. అందఱు గౌతమముని చుట్టూ చేరి ప్రసన్నుడవు కమ్మని పలుమార్లు ప్రార్ధించారు.





అంతట గౌతముని శాపము వలన బ్రాహ్మణులు వేదములు మరచిపోయారు. వారికి గాయత్రీ మంత్రము స్ఫురించడం లేదు. ఇదంతా ఎదో వింతగా తోచింది. శాపగ్రస్తులు అయిన బ్రాహ్మణులు గౌతముడి చుట్టూ చేరి సాగిలపడి మ్రొక్కి ప్రసన్నుడవు కమ్మని పలుమార్లు ప్రార్ధించారు. తుట్టతుదకు గౌతముడి మనస్సు కరిగి "మీరందఱు శ్రీకృష్ణావతారము వరకు కుంభీపాక నరకమున ఉండండి. మరియు కలియుగమున జన్మించగలరు. అప్పుడు నేను ఇచ్చిన శాపములన్నియు జరిగితీరును. ఇది నిజాము. నామాటకు తిరుగులేదు. కానీ శాపము నుండి విముక్తి పొందదలచినచో మీరు గాయత్రీదేవి పాద కమలములు సేవించండి. అని పలికి గౌతముడు వారిని విడిచి "ఇదంతా ప్రారబ్ద కర్మ"యని తలచి శాంతచిత్తుడు అయ్యాడు.






ఆకారణం చేత శ్రీకృష్ణుడు అవతారం చాలించగానే కుంభీపాక నరకము నుండి బయటికి వచ్చారు. ముని శాపమునకు దగ్దులు అయినవారే ఇప్పుడు "త్రికాల సంధ్యావందను -గాయత్రి జపరతి లేని అధమాధములైన బ్రాహ్మణులుగా జన్మించారు. వారే వేద తెలియనివారు, భక్తి రహితులు, పాషండ మతస్థులు, అగ్నిహోత్రాది కర్మరహితులు స్వాహా-స్వధా రహితులు అయ్యారు. వారిలో ఒక్కడైనా మూలప్రకృతి స్వరూపము ఎఱిగినవాడు లేడు. వారిలో కొందఱు తప్తముద్రలు వేయించుకున్నారు. కొందఱు కామాచారాపరులయ్యారు. మరికొందరు మహాపండితులు అయినా కాపాలికులు కౌలికులు-బౌద్ధులు-జైనులు-దురాచార - పాషండ వర్తనులు అయ్యారు. వారే పరాధారా వంపుసొంపుల యందు చిక్కుకున్న చిత్తము కలవారు దురాచార వర్తనులు అయ్యారు. కనుక వారు మరల తమతమ చెడు వర్తనల వలన చెడుకర్మల పరిపాకము వలన కుంభీపాక నరకము నందు కూలతారు. విష్ణూపాసన, శివోపాసన నిత్యములు కావు. శ్రీగాయత్రి ఉపాసనే నిత్యోపాసన. నీవు మాత్రం సర్వాత్మభావముతో శ్రీపరమేశ్వరినే సేవింపుము.. అని జనమేజయునకు వ్యాసుడు తెలియజేశాడు.....





తిండిలేక జనాన్ని పీక్కుతినే పరిస్థితులలో వచ్చినవారు కడుపు నిండగానే ఎలా మారిపోయారో చూశారా? అన్నం పెట్టినవాడినే నాశనం చేయాలని చూడడం ఎంతటి ఘోరం.. ఈ కథ చదివితే ఈ కలియుగంలో ఈజనం ఎందుకు ఇలా ఉన్నారో! అర్థమౌతుంది. ఎందుకు ఇన్ని వర్గాలు (మతాలు అంటున్నాం మనం.. కానీ మతం అనకూడదు. వర్గం లేదా తెగ అనాలి.)..ఉన్నాయో తెలుస్తుంది. మనం చూసే అన్యమతాలు ఎలా ఏర్పడ్డాయో చూసారు కదా! కనుక ఇకనైనా జాగ్రత్తగా ఉండండి. అమ్మవారికే కోపం తెప్పిస్తే ఎలా?





గమనిక : ఇది చదివి ఒక వర్గం మీద ద్వేషం పెంచుకోమని చెప్పడంలేదు సుమా! ఈర్ష్య పడితే ఎంతటి ప్రమాదం సంభవిస్తుందో తెలుసుకొని ఈర్ష్య చెందడం మానండి. అంతేతప్ప బ్రాహ్మణ ద్వేషం ఎప్పటికీ మంచిదికాదు. తరతరాలు వెంటాడతాయి. చేసిన అపరాధానికి తరతరాలు భ్రష్టం అయిపోయాయి. వీరికి ఇప్పట్లో విముక్తి లేదు. ఉండదు. ఉంటుంది కాని వీళ్ళని వీళ్ళు తెలుసుకోవాలి. శాప ప్రాభవం చేత చెప్పినా వినరు. మనం చూస్తూనే ఉన్నాం కదా!
దేవీభాగవతం - ద్వాదశ స్కంధం..

No comments:

Post a Comment